Monday, 17 October 2011

వరమే! శాపమై-1


           


             ఒక్కసారిగా యీ నేలపై కారుమేఘాలకు ప్రేమ పొంగుకొచ్చింది ఉరుములు మెరుపులతో ఉగ్రరూపం దాల్చి ధరణి పైకి వర్షమై దూసుకొచ్చేందుకు సిద్దమైంది.ఈ ప్రయత్నానికి గాలికూడా తోడైంది!అకాశం నుండి ఆవేశం చినుకై ప్రయాణం సాగించిన నీటి చుక్క చెట్టు కొమ్మపై నిదురిస్తున్న కోకిలను తాకింది,తొలిచినుకు తాకిడికి నిద్రమత్తు వదిలి వాస్తవంలోకి వచ్చింది.చుట్టూ చీకటి విమరీతమైన గాలి మగతలో తెలియలేదుకానీ గాలిహోరు తనలాంటి చిన్ని పక్షులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది,ఇక తనకు ఆశ్రయమిచ్చిన మహావృక్షం శివతాండవం చేస్తుంది!ఈ పరిస్తితులలో తనను కొమ్మపై పట్టు దొరకట్లేదు!ఈ గాలి వానంటేనే కొయిలకు చాలా భయం,గతకొన్ని రోజుల ముందు ఇలాంటి జాలిలేని తుఫాను మిగిల్చిన విషాదంలోంచి ఇంకా బయటపడనేలేదు ఇంతలోనే మళ్ళీ ఎటువంటి విషాదాన్ని మోసుకొచ్చిందో అన్న ఆలోచన మదిలో మెదిలింది!అంతే ఆక్షణానే కోకిల నెత్తిన పిడుగు పడ్డటైంది!ఆ భయంకర శబ్ధానికి గట్టిగా మూసిన కనులు తెరిచేలోపలే తన పక్కన ఓ అలజడి,కోకిల ఉన్న చెట్టుకు కొంత దూరంలో చెట్టు కాలిపోతుంది.ఇవ్వాళ సాయంత్రం వరకు ఎంతో సందడి చేసిన కొన్ని పక్షులు రేపటి ఉషోదయాన్ని చూడలేని శాశ్వత నిద్రలోకి జారుకున్నాయి.ఆ విషాదకర దృశ్యం అంత వర్షంలోను కోకిలమ్మ కంట కన్నీటి జాడల్ని చూపింది!
   
    ఇప్పుడు మరో మెరుపు వెలుగు లో పక్క చెట్టుపై కాకి గూటిలో కి చూసింది.కాకి తనపట్టు కోల్పోతున్నా తన గూటిలోని గుడ్లను కాపాడాలి అన్న ఒకేఒక్క కారణంతో గూటిని అంటిపెట్టుకొనేవుంది!తను ఎలాంటి పరిస్తితులలో వున్నా కాకి గుడ్లను కాపాడే ప్రయత్నాన్ని చూసాక కోకిల మనసు కుదుట పడింది.మినుగురు వెలుగు మినుకు మినుకుమన్నట్లు ఆకాశం నుండి ప్రసరించే మెరుపు వెలుగులలో కాకి గూటినే చూస్తూ చుట్టూ వున్న పరిస్థితులను మరచి వర్షం వెలిసిపోయేవరకూ బిక్కుబిక్కు మంటూ గడిపింది. 
     
               చిల్లు పడిన ఆకాశానికి మరమ్మత్తులు ఎప్పుడు జరిగాయో!తనెప్పుడు  నిద్రలోకి జారిందో కాని,కోకిలకు కనులు మూసినంతనే తెలవారుతున్నట్లనిపించింది.మసకలలోంచి హృదయవిధారక దృశ్యం స్పష్టంగా కనులను వెంబడిస్తుంది!ముందున్న ఆనవాళ్ళు మునుపటి విషాద జ్ఞాపకాలని సంతోషపు ముసుగేసి ముందు ఉంచాయి...  


                                     ************

వరమే! శాపమై...